nandigam suresh: కన్నతండ్రి జైల్లో ఉంటే లోకేశ్ ఢిల్లీలో రఘురామకృష్ణరాజు గెస్ట్ హౌస్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు: ఎంపీ నందిగం సురేశ్
- టీడీపీ బలహీనపడిందని పవన్ కల్యాణ్ చెప్పారన్న వైసీపీ నేత
- తండ్రి జైలుకు వెళ్తే లోకేశ్ బాధపడే వ్యక్తి కాదని విమర్శలు
- తీసుకున్న డబ్బుకు నమ్మకంగా పని చేయాలి కాబట్టి పవన్ బాధపడుతున్నాడన్న నందిగం సురేశ్
కన్నతండ్రి చంద్రబాబు జైల్లో ఉంటే నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్ళి ఎంపీ రఘురామకృష్ణరాజు గెస్ట్ హౌస్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఎంజాయ్ చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ జెండాను చూసి వైసీపీ భయపడుతోందని లోకేశ్ అంటున్నారని, కానీ తమకు భయమెందుకని ప్రశ్నించారు. టీడీపీ బలహీనపడిందని జనసేన అధినేత పవన్ కల్యాణే చెప్పారన్నారు. పవన్ అలా చెప్పినందుకు టీడీపీకి కనీసం సిగ్గుండవద్దా? అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయితే దరిద్రం వదిలిందని టీడీపీ నేతలు, కార్యకర్తలే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై అయ్యో పాపం అనేవారే లేరన్నారు. కనీసం లోకేశ్ కూడా అనడం లేదని, పవన్ కల్యాణ్ ఒక్కరే బాధపడుతున్నారన్నారు. లోకేశ్‌ది బాధపడే మనస్తత్వం కాదని, మా అయ్య జైలుకు పోతే నాకు సీఎం పదవి వస్తుందని, పార్టీ చేతిలోకి వస్తుందని ఆలోచించే వ్యక్తి అని మండిపడ్డారు. కానీ తీసుకున్న సొమ్ముకు నమ్మకంగా పని చేయాలి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ ఒక్కడే ఫీలవుతున్నాడన్నారు. చంద్రబాబు అరెస్టుపై కనీసం టీడీపీ కార్యకర్తలు, నేతలు కూడా ఫీల్ కావడం లేదన్నారు.
రాష్ట్రానికి జగన్ అవసరం ఇంకా ఇరవై ఏళ్లు ఉందన్నారు. చంద్రబాబు అవసరం లేదని ఆ పార్టీయే అనుకుంటోందని, పవన్ మాత్రం జైలుకు వెళ్లి చంద్రబాబు ముసలి రక్తం ఎక్కించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ వారాహి యాత్ర చేశారని, కానీ టీడీపీతో కలిశాక ఆయన సభలకు ప్రజలు రావడం లేదన్నారు. జనసేన కార్యకర్తలకు, నాయకులకు కూడా టీడీపీతో కలవడం ఇష్టంలేదని నందిగం సురేశ్ అన్నారు.