vivek ramaswamy: వివేక్ రామస్వామి కాన్వాయ్‌పై దాడికి యత్నం.. కారును ఢీకొట్టిన దుండగులు
- ఉక్రెయిన్‌కు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తానని ఇటీవల ప్రకటించిన వివేక్ రామస్వామి
- వివేక్ రామస్వామికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ మద్దతుదారుల నిరసన
- అయోవాలోని గ్రిన్నెల్‌లో కాన్వాయ్‌లోని ఎస్‌యూవీని ఢీకొట్టిన దుండగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వ పోటీదారు వివేక్ రామస్వామి కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఉక్రెయిన్‌పై ఆయన వ్యాఖ్యలకు నిరసనగా అయోవాలోని గ్రిన్నెల్‌లో ఈ దాడి జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.
తన కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు వివేక్ రామస్వామి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇద్దరు నిరసనకారులు తనతో వాగ్వాదానికి దిగారని, వారికి తాను చాలా ఓపికగా సమాధానాలు చెప్పానని, కానీ వారిద్దరు తమ బ్లూ కలర్ హోండా సివిక్ కారుతో తన కాన్వాయ్‌లోని ఎస్‌యూవీని ఢీకొట్టారని తెలిపారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందికి అసభ్యకర సంజ్ఞలు చేశారన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాలు తెలిపే హక్కు ఉందని, కానీ ఇలా దాడి సరైన విధానం కాదన్నారు. వివేక్ నిరసనకారులతో మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేశారు.
ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరని, తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వివేక్ స్పష్టం చేశారు. కాగా, తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఉక్రెయిన్‌కు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తానని వివేక్ రామస్వామి ఇటీవల ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.