Bandarasatyanarayana: మంత్రి రోజాకు అండగా నటి రాధిక.. టీడీపీ నేత బండారుపై ఫైర్

Actress Radhika Supports AP Minister RK Roja

  • వీడియో షేర్ చేసిన రాధిక
  • ఓ స్నేహితురాలిగా, సహనటిగా రోజాకు అండగా ఉంటానన్న సీనియర్ నటి
  • దిగజారుడు రాజకీయాలంటూ ఆవేదన
  • ఇలాంటి వ్యాఖ్యలతో గొప్ప పార్టీని, గొప్ప బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులను అవమానించారని మండిపాటు
  • బండారు వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. ఈ కేసులో ఆయన అరెస్టై బెయిలుపై విడుదల అయ్యారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా, రోజాకు వెటరన్ నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను  షేర్ చేశారు. 

అందులో ఆమె మాట్లాడుతూ.. ఓ స్నేహితురాలిగా, సహనటిగా ఆమెకు అండగా ఉంటానని తెలిపారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను విపరీతంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలంటూ విచారం వ్యక్తం చేశారు. వాటిని చూసి తనకు ఆగ్రహం కూడా కలుగుతోందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటు బిల్లు కూడా పాస్ చేసిందని, దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.

మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారని, మనందరం సమైక్యంగా ఉంటూ దేశాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఓ గౌరవనీయ వ్యక్తి నుంచి, పార్టీ నుంచి ఇలాంటి కామెంట్లు రావడం చాలా అవమానకరమన్నారు. భారత్‌ను మాతగా పిలుచుకుంటామని, అలాంటిది మహిళలను ఇలాగా గౌరవించేది అంటూ మండిపడ్డారు. ఇది రాజకీయాలకే అవమానకరమన్నారు. ఒక మహిళను ఎదుర్కోవడం ఇలానేనా? అని ప్రశ్నించారు. అలా మాట్లాడితే మహిళలు భయపడతారనుకుంటే అది చాలా తప్పని అన్నారు. మీరు రాజకీయాల కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. కాబట్టి అలా అందరినీ ఒకే గాటన కట్టి మాట్లాడొద్దని హితవు పలికారు. 

ఇలాంటి మాటలతో హింసించాలనుకోవడం సరికాదని, దీనివల్ల మీరు పొందే ప్రయోజనం ఏంటని బండారు సత్యనారాయణను నిలదీశారు. ఇది మీకు సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఓ గొప్ప పార్టీని, ఓ గొప్ప బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోడానికి లేదని, తాను రోజాకు, మహిళలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని రాధిక ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News