Cental Railway: పూణె-ముంబై మార్గంలో రైలు పట్టాలపై బండరాళ్లు పెట్టిన దుండగులు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!
- ఐదు చోట్ల బండరాళ్లు గుర్తించి తొలగించిన రైల్వే సిబ్బంది
- నాలుగు రోజుల క్రితం ఉదయ్‌పూర్-జైపూర్ మార్గంలో వందేభారత్ రైలుకు తప్పిన ప్రమాదం
- రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు
- సంఘవిద్రోహుల పనే అంటున్న అధికారులు
పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై ఐదు వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. నిన్న మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో పూణె-ముంబై అప్‌లైన్‌పై వీటిని గుర్తించిన రైల్వే అధికారులు తొలగించడంతో ప్రమాదం తప్పింది.
ఇది తప్పకుండా సంఘవిద్రోహ శక్తుల పనేనని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ మనాస్‌పూర్ తెలిపారు. ఆ మార్గంలో అప్పటికే పనిచేస్తున్న పెట్రోలింగ్ బృందం బండరాళ్లను తొలగించినట్టు పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లోనూ తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
నాలుగు రోజుల క్రితం నార్త్ వెస్ట్రన్ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్) అధికారులు ఉదయ్‌పూర్-జైపూర్ ట్రాక్‌పైనా బండరాళ్లను గుర్తించారు. ఫిష్‌ప్లేట్లను కూడా దుండగులు ట్రాక్‌పై పెట్టారు. గమనించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సిబ్బంది బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారించారు.