Telangana: తెలంగాణలో మరో 10 రోజులపాటు మండనున్న సూరీడు.. ఉక్కిరిబిక్కిరి చేయనున్న వేడి గాలులు
- నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం
- కనుచూపు మేరలో కనిపించని వానలు
- తుపాన్లు వస్తే తప్ప చల్లబడే అవకాశం లేదంటున్న వాతావరణశాఖ
- రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి వాతావరణం
తొలుత దంచికొట్టిన వానలు తర్వాత ముఖం చాటేయడం, వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. అప్పుడప్పుడు మేఘావృతం అవుతున్నా చుక్క వర్షం మాత్రం కురవడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది. వచ్చే పది రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
వాతావరణం వేడెక్కడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు వేడు గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అవి వస్తే తప్ప వాతావరణం చల్లబడే అవకాశం లేదని వాతావరణశాఖ అభిప్రాయపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపింది. అయితే, ఈ నెల 9 వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం 32 డిగ్రీలు, ఆపై ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.