CPI Ramakrishna: లోకేశ్‌కు కనీసం రెండు నిమిషాల సమయమివ్వలేదు, పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి: సీపీఐ రామకృష్ణ
- కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్న రామకృష్ణ
- స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శ
- వైసీపీని ఓడించాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామన్న రామకృష్ణ
- వైసీపీకి కేంద్రం సహకరిస్తోందని పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని సూచన
కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం తప్ప ఏం చేయలేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారన్నారు. ఏపీలో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై తక్షణమే స్పందించి అన్ని సంఘాలు, పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీని ఓడించాలని, ఇందుకు కలిసి వచ్చే పార్టీలతో రాబోయే ఎన్నికల్లో యుద్ధం చేస్తామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం విభేదిస్తున్నామని, రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు సహకరిస్తోంది కేంద్రంలోని బీజేపీ అని జనసేనాని తెలుసుకోవాలన్నారు. అమరావతి రాజధానిని నిలిపేసినా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా వైసీపీకి బీజేపీ పూర్తిగా సహకరిస్తోందన్నారు. లోకేశ్ ఇరవై రోజులకు పైగా ఢిల్లీలో ఉన్నా కనీసం రెండు నిమిషాలు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. కానీ జగన్ గంటలపాటు భేటీ అవుతున్నారన్నారు.