India: ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ఘనంగా ముగించిన భారత్
- చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో 19వ ఆసియా క్రీడలు
- 107 పతకాలు సాధించిన భారత్
- 2018 ఆసియా క్రీడల్లో భారత్ కు 70 పతకాలు
- ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి 100 పతకాల మార్కు అందుకున్న భారత్
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ముగించింది. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ పతకాల సంఖ్య 100 దాటింది. హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలు గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రీడోత్సవాల్లో భారత్ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు సాధించింది.
2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు సాధించగా, ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో అదే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఇప్పుడు ఏకంగా 100 పతకాల మార్కు దాటడం విశేషం. బ్యాడ్మింటన్ లో తొలిసారి స్వర్ణం సాధించడం హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లోనే సాధ్యమైంది.
అత్యధికంగా షూటింగ్ క్రీడాంశంలో 7 స్వర్ణాలు లభించాయి. అథ్లెటిక్స్ లో 6, ఆర్చరీలో 5, క్రికెట్లో 2, స్క్వాష్ లో 2, కబడ్డీలో 2, ఈక్వెస్ట్రియన్ లో 1, టెన్నిస్ లో 1, బ్యాడ్మింటన్ లో 1, హాకీలో 1 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి.
ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ పసిడి పతకం గెలిచి తన ప్రతిభను ఘనంగా చాటుకుంది. ఆసియా క్రీడల క్రికెట్లో పురుషుల, మహిళల విభాగం రెండింట్లోనూ భారత్ కు స్వర్ణాలు లభించాయి.