Israel: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు... భారత్ పై ప్రభావం ఉంటుందన్న ఆర్థికవేత్తలు
- ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడులు
- భీకరంగా ప్రతీకార దాడులు చేపడుతున్న ఇజ్రాయెల్
- పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ వాతావరణం
ఇజ్రాయెల్ పై హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపుదాడులకు పాల్పడి 400 మందికి పైగా పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. నిన్న కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ప్రయోగించిన హమాస్... పారాగ్లైడర్లతో పెద్ద సంఖ్యలో మిలిటెంట్లను ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశపెట్టింది. హమాస్ మిలిటెంట్ల కాల్పులతో ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ పాలస్తీనా, గాజా స్ట్రిప్ ప్రాంతాలపై నిన్నటి నుంచి విరుచుకుపడుతోంది.
తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం గనుక సంభవిస్తే, ఆ ప్రభావం భారత్ పై గణనీయ స్థాయిలో ఉంటుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో భారత్ కు ముడిచమురు సరఫరా ఇబ్బందుల్లో పడుతుందని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే, అంశాలపై ఇప్పుడప్పుడే ఓ అంచనాకు రాలేమని, వేచిచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఓ రీసెర్చ్ సంస్థ అధిపతి సుమన్ చౌదరి దీనిపై స్పందిస్తూ, పశ్చిమాసియాలో సంక్షోభం ముదిరితే అది ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందని, ఈ వివాదంలో కొన్ని దేశాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని వివరించారు.
ఇప్పటికే ఒపెక్ దేశాలు చమురు సరఫరాలో కోతలు విధించడంతో అంతర్జాతీయంగా ధరలు భగ్గుమంటున్నాయని, ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభంతో చమురు సరఫరా ఓ సవాల్ గా మారనుందని పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయ వైరుధ్యాల పెరుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం మరింత మందగమనంలో సాగుతాయని, దానివెంటే ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉంటుందని సుమన్ చౌదరి తెలిపారు. ఇది మన రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించారు. అయితే, ఇజ్రాయెల్ తో భారత్ వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకు కాస్త ఎక్కువ ఉంటుందని, యుద్ధం కారణంగా భారత్ పై నేరుగా పడే ప్రభావం పరిమితంగానే ఉంటుందని అన్నారు.
ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ స్పందిస్తూ, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మొదట ప్రభావితమయ్యేది చమురు ధరలు, ఆపై కరెన్సీ ప్రభావితమవుతుంది అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం వస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.