Israel War: ఇజ్రాయెల్ లో ఒక్క మ్యూజిక్ ఫెస్ట్‌లోనే 260 మృతదేహాలు!
- ఇజ్రాయెల్‌లో శవాల కుప్పలు
- ఇప్పటి వరకు ఇరువైపుల 1100 మంది మృతులు
- ఒక్క ఇజ్రాయెల్‌లోనే 44 మంది సైనికులు సహా 700 మంది మృతి
- భీకరంగా కొనసాగుతున్న యుద్దం
- ఇజ్రాయెల్‌కు అదనపు సాయానికి ముందుకొచ్చిన అమెరికా
ఇజ్రాయెల్‌ను చెరబట్టేందుకు ప్రయత్నిస్తున్న హమాస్ ఉగ్రవాదుల అరాచకాలు మాటలకు అందకుండా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లపై హమాస్ యుద్ధం నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఇరువైపులా కలిపి ఇప్పటి వరకు 1,100 మంది చనిపోయినట్టు అంచనా. ఒక్క ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా మృతి చెందారు.
నిన్న ఓ మ్యూజిక్ ఫెస్ట్‌పై దాడిచేసి ఓ యువతి, ఆమె ప్రియుడిని కిడ్నాప్ చేసిన హమాస్ మిలిటెంట్లు.. మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారిని దారుణంగా కాల్చిచంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ హాలు నుంచి ఇప్పటి వరకు 260 మృతదేహాలను మెడికల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ ‘జకా’ పేర్కొంది.
ఊహంచని విధంగా పక్కా వ్యూహంతో హమాస్ జరుపుతున్న దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. ఎక్కడికక్కడ మిలిటెంట్లను అడ్డుకుని దీటుగా బదులిస్తోంది. మరోవైపు, ఇజ్రాయెల్‌కు అవసరమైన అదనపు సాయాన్ని అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ ఆదేశించారు. ఇంకోవైపు, హమాస్ ఇంకా తీవ్రంగానే విరుచుకుపడుతోంది. మిస్సైళ్లతో ఇజ్రాయెల్ నగరాలపై ఊపిరిసలపకుండా దాడులు చేస్తోంది.