Elections: తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
- మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా నవంబర్ లోనే ఎలక్షన్స్
- 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
- డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామన్న రాజీవ్ కుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 30న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ అధికారులు ఐదు రాష్ట్రాలలో పర్యటించారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారని వివరించారు.
ఐదు రాష్ట్రాలలో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలు, 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటింగ్ కోసం 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మిజోరంలో మొత్తం 8.52 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది, మధ్య ప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
ముఖ్యమైన తేదీలు..
ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 3
నామినేషన్ల స్వీకరణకు గడువు తేదీ: నవంబర్ 10
నామినేషన్ల స్క్రూటినీ: నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15
పోలింగ్ తేదీ: నవంబర్ 30
కౌంటింగ్ తేదీ: డిసెంబర్ 3