KL Rahul: టీమిండియాలో తాను ఎంత ముఖ్యమో తెలియజెప్పిన కేఎల్ రాహుల్
- గాయం నుంచి కోలుకున్న తర్వాత రాహుల్ మెరుగైన ప్రదర్శన
- ఆసియాకప్ లో పాకిస్థాన్ పై చెలరేగి సెంచరీ చేసిన తీరు
- ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కైవసంలోనూ కీలక పాత్ర
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించి, టీమిండియాకు తాను ఎంత విలువైన ఆస్తి అనేది కేఎల్ రాహుల్ మరోసారి చాటి చెప్పాడు. 115 బంతులను ఎదుర్కొన్న అతడు 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా కోసం రాహుల్ కీలక ఇన్నింగ్స్ లు ఆడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎన్నో సార్లు తాను ఏంటో నిరూపించాడు. ముఖ్యంగా ఇటీవలి గాయం తర్వాత రాహుల్ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఆసియాకప్ 2023లో పాకిస్థాన్ పై 111 పరుగులు చేసి, విజయానికి దోహదపడ్డాడు.
వన్డే ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రాహుల్ రెండింటికి సారథిగా వ్యవహరించాడు. రెండు మ్యూచుల్లోనూ జట్టును గెలిపించి సిరీస్ ను భారత్ వశం చేశాడు. ఈ సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ముఖ్యంగా నిన్నటి మ్యాచ్ లో భారత్ ఒత్తిడిలో ఉన్న సమయంలో తన అనుభవాన్ని ప్రదర్శించిన తీరుపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ 5వ స్థానంలో సరిగ్గా సరిపోతాడని, ఎలాంటి పరిస్థితులను అయినా అతడు ఎదుర్కోగలడని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2023లో గాయం కారణంగా దూరమైన రాహుల్, కోలుకున్న అనంతరం ఆడిన 7 ఇన్సింగ్స్ ల్లోనూ స్ట్రయిక్ రేటు సగటున 100.5గా ఉంది. మొత్తం 407 పరుగులు సాధించాడు. రోహిత్ అందుబాటులో లేని సమయంలో రాహుల్ సారథ్యంలో జట్టును నడిపించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలుస్తుండడం అతడికి ప్రోత్సాహాన్నిస్తోంది. ఇది అతడికి కలిసొచ్చే బలంగా చెప్పుకోవాలి.