HCA: ఇద్దరు క్రికెటర్లపై నిషేధం వేటు వేసిన హెచ్ సీఏ
- మహ్మద్ బాబిల్లేల్, శశాంక్ మెహ్రోత్రాపై వేటు
- జట్టు ఎంపిక సమయంలో తప్పుడు పత్రాలు అందజేశారని ఆరోపణ
- ఇద్దరు క్రికెటర్లపై ఐదేళ్ల నిషేధం
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) తాజాగా ఇద్దరు క్రికెటర్లపై నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ హెచ్ సీఏ ఉత్తర్వులు జారీ చేసింది.
జట్టు ఎంపిక సమయంలో వీరిద్దరూ తప్పుడు పత్రాలు సమర్పించినట్టు హెచ్ సీఏ నిర్ధారించింది. మోసపూరితంగా పత్రాలు రూపొందించి, వాటి సాయంతో జట్టుకు ఎంపికవ్వాలని భావించారని హెచ్ సీఏ ఆరోపించింది. మహ్మద్ బాబిల్లేల్, శశాంక్ మెహ్రోత్రాలపై క్రిమినల్ కేసులు కూడా పెట్టినట్టు తెలుస్తోంది.
దీనిపై హైదరాబాద్ క్రికెట్ సంఘం సీఈవో సునీల్ కాంటే స్పందించారు. తమ విచారణలో సదరు ఆటగాళ్లు దోషులని నిర్ధారణ అయిందని, దాంతో వారిని జట్ల నుంచి తొలగించామని వెల్లడించారు.
హెచ్ సీఏ నియమనిబంధనల పట్ల క్రికెట్ క్లబ్బులు, కోచింగ్ అకాడమీలు ఆటగాళ్లకు అవగాహన కల్పించాలని సూచించారు. మెరుగైన క్రికెట్ వ్యవస్థ కోసం తాము కృషి చేస్తున్నామని కాంటే తెలిపారు.