Somireddy Chandra Mohan Reddy: ఆ మాట జగన్ చెప్పుకుంటున్నాడే తప్ప ప్రజలెవరూ చెప్పడంలేదు: సోమిరెడ్డి

Somireddy slams Why AP needs Jagan campaign

  • వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ ప్రచారం
  • ఏం చేశాడని జగన్ మళ్లీ కావాలి అంటూ సోమిరెడ్డి ఆగ్రహం
  • ఈడీ, సీబీఐ ఏపీ వైపు కన్నేయాలని డిమాండ్

వై ఏపీ నీడ్స్ జగన్ (రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి) అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుకు మరలా జగన్ కావాలా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలు భారత దేశ పౌరుల్లా జీవించేందుకు అవసరమైన హక్కులకోసం పోరాడే దుర్గతి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. 

మీ బిడ్డను... మీ అన్నను... మీ తమ్ముడిని... రాష్ట్రానికి నా అవసరం ఉంది అని జగన్ చెప్పుకుంటున్నాడే తప్ప ప్రజలు చెప్పడంలేదని స్పష్టం చేశారు. తాను పేదల పక్కన ఉన్నానని జగన్ చెప్పుకుంటున్నాడు... వాస్తవానికి ఆయన పక్కన ఉంది వేల కోట్లతో లిక్కర్, ఇసుక వ్యాపారం చేసేవారు, వేలకోట్ల విలువైన కాంట్రాక్టులు కొట్టేసే కాంట్రాక్టర్లు, అదానీలు, పరిమల్ నత్వానీలు అని సోమిరెడ్డి విమర్శించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్ పక్కన ఉన్నారనేనా... అధికారంలోకి వచ్చీరాగానే టీడీపీ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు, పథకాలు అన్నీ రద్దు చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"విజయవాడలో జరిగిన వైసీపీ జనరల్ బాడీ సమావేశంలో వై ఏపీ నీడ్స్ జగన్ (ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి) అనే దానిపై జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పుకొచ్చారు. పేదలు ఒక పక్క.. పెత్తందారులు ఒకపక్క ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదలకు తానే ప్రతినిధినని ఆయన చెప్పుకున్నారు. 

80 శాతం మంది ప్రజలకు బటన్ నొక్కాను అంటున్న జగన్ రెడ్డి ఆ పనిచేశాడో లేదో తెలియదు గానీ, రాష్ట్రంలోని 100 శాతం కుటుంబాలపై భారీ స్థాయిలో భారాలు వేశాడు. విద్యుత్ ఛార్జీలు పెంచాడు.. నిత్యావసరాల ధరలు పెంచాడు.. కర్ణాటక కంటే రూ.12 లు డీజిల్ ధర, 10 రూపాయల పెట్రోల్ ధర పెంచాడు. 

టీడీపీ ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛన్ ను రూ.2 వేలు చేసింది. జగన్ రెడ్డి ఐదేళ్లు పూర్తయ్యే ముందు రూ.3 వేలు చేస్తున్నాడు! అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు పింఛన్ ఇస్తానన్న వ్యక్తి.. ఇప్పుడు 2024 జనవరిలో పింఛన్ రూ.3 వేలు చేస్తానంటున్నాడు. ఇలా చేసినందుకు మరలా తానే రాష్ట్రానికి కావాలనుకుంటున్నాడు. 

తన అవినీతి, అక్రమాలు,  దోపిడీని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదుల్ని పోలీసుల సాయంతో కర్కశంగా అణచివేస్తున్నాడు కాబట్టి... మరలా జగనే రాష్ట్రానికి కావాలి. ప్రతిపక్ష నేత రూ.6 లక్షల కోట్ల అవినీతి చేశాడని ఎన్నికలకు ముందు చెప్పి.. ఇప్పుడు రూ.27 కోట్లకు దిగి, అక్రమ కేసులతో ఆయన్ని జైలుకు పంపాడు కాబట్టి.. మరలా జగనే ఈ రాష్ట్రానికి కావాలి. 

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆయన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు అమలు చేసిన పథకాలు అన్నీ ఆపేసి, మొత్తం తానే చేశానని జగన్ లాగా ఎవరూ చెప్పుకోలేదు. రాజశేఖర్ రెడ్డి పథకాలను చంద్రబాబు ఆపలేదు. చంద్రబాబు అమలు చేసిన అనేక గొప్ప పథకాల్ని జగన్ ఆపేశాడు. 

కల్తీ మద్యం తాగిస్తూ రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తున్నాడు. ఈ విషయం మేం చెప్పడం కాదు... దేశాన్ని పరిపాలించే బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలే చెబుతున్నారు. రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ కోరుతున్నారు. మేం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఈడీ, సీబీఐ ఏపీ వైపు కన్నేయాలని కోరుతున్నాం” అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News