Cricket: అన్నీ కుదిరితే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
- 1900 ఒలింపిక్స్ లో తొలిసారి క్రికెట్ క్రీడకు స్థానం
- ఫ్రాన్స్ పై ఏకైక మ్యాచ్ లో నెగ్గి స్వర్ణం సాధించిన ఇంగ్లండ్
- ఆధునిక ఒలింపిక్స్ లో క్రికెట్ కు దక్కని స్థానం
- ఒలింపిక్ కమిటీ ముందు అధికారిక ప్రతిపాదన
- 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కు స్థానం కల్పించే అవకాశాలు మరింత మెరుగు
అమెరికా నగరం లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వనుంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ కు స్థానం కల్పించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కు స్థానం కల్పించడంపై తాము అధికారికంగా ప్రతిపాదన చేశామని నిర్వాహకులు ప్రకటించారు.
ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న క్రీడల్లో ఒకటిగా క్రికెట్ కు గుర్తింపు ఉంది. ఇప్పటివరకు క్రికెట్ కామన్వెల్త్ క్రీడల్లో ఎంట్రీ ఇచ్చింది కానీ, ఆధునిక ఒలింపిక్స్ గడప మాత్రం తొక్కలేదు. 1998లో కౌలాలంపూర్ కామన్వెల్త్ క్రీడలు, 2022లో బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ క్రీడాంశానికి కూడా చోటిచ్చారు.
ఎప్పుడో 1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ జరగ్గా, ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఫ్రాన్స్ ను ఓడించింది. పారిస్ లో జరిగిన నాటి ఒలింపిక్స్ లో క్రికెట్ స్వర్ణం ఇంగ్లండ్ ను వరించింది.
ఇప్పుడు ఒలింపిక్స్ లో మరోసారి క్రికెట్ కు స్థానం కల్పించే అంశంపై ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే స్పందించారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028లో క్రికెట్ ను చేర్చాలని ప్రతిపాదన చేయడం తమను సంతోషానికి గురిచేసిందని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు.