Elections: నవంబర్‌లో తెలంగాణ ఎన్నికలు.. గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్
- నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్
- 24-30 వరకూ ఉపాధ్యాయ పరీక్షలు
- నవంబర్ 3న నోటిఫికేషన్ల స్వీకరణ ప్రారంభం, అదే రోజు గ్రూప్-2 పరీక్ష
- ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, గ్రూప్-4 ఫలితాల విడుదలపై సందేహాలు
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ ఆందోళన మొదలైంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ పరీక్షల నోటిఫికేషన్ ప్రకారం, నవంబర్ 20-23 మధ్య స్కూల్ అసిస్టెంట్స్, పండిట్ పోస్టులు, నవంబర్ 24-30 మధ్య ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. దీంతో, మొత్తం ఉపాధ్యాయ పరీక్షలు వాయిదా వేస్తారా? ఆ రోజు జరగాల్సినవి మాత్రమే వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు నుంచే అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టిపెట్టాల్సి రావడంతో టీచర్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఇక గ్రూప్స్ విషయంలో కూడా ఇదే తరహా సందేహాలు వినిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 నవంబర్ 2, 3 తేదీల్లో జరగాలి. కానీ నవంబర్ 3 నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో, ఉన్నతాధికారులందరూ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని, ఫలితంగా పరీక్షల నిర్వహణ సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. ఆపై ఎన్నికల అనంతరమే మళ్లీ పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్-4 ఫలితాలు వెల్లడిస్తారా లేదా అన్న విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి.