Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం.. లోకేశ్ విచారణ సమయంలో దర్యాప్తు అధికారి మార్పు
- ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ జయరామరాజు
- ఆయన స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ కు బాధ్యతల అప్పగింత
- ఈ మేరకు ఏసీబీ కోర్టులో మోమో దాఖలు చేసిన సీఐడీ
ఏపీ రాజకీయాలకు కుదిపేస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఇప్పటి వరకు విచారిస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చినట్టు ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తు బాధ్యతల నుంచి అడిషనల్ ఎస్పీ జయరామరాజును తప్పించారు. ఆయన స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ కు బాధ్యతలను అప్పగించారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు అధికారిగా విజయ్ భాస్కర్ వ్యవహరించబోతున్నారు.
మరోవైపు ఈ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం గంట సేపు భోజన విరామం ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చడం గమనార్హం. లోకేశ్ ను ప్రస్తుతం విచారిస్తున్న అధికారుల్లో జయరామరాజు, విజయ్ భాస్కర్ ఇద్దరూ ఉన్నారు. ప్రస్తుతం జయరామరాజు నేతృత్వంలోనే లోకేశ్ విచారణ కొనసాగుతోంది. భోజనం తర్వాత విజయ్ భాస్కర్ నేతృత్వంలో విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కోర్టు అనుమతితోనే ఇది జరుగుతుంది. మరోవైపు, ఏ కారణాల వల్ల విచారణ అధికారిని మార్చారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.