Payyavula Keshav: చంద్రబాబును చూడగానే కొద్దిసేపు బాధ కలిగినా, ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చూశాక ధైర్యం వచ్చింది: పయ్యావుల

Payyavula Keshav press meet after Mulakhat with Chandrababu at Rajahmundry central jail

  • స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • చంద్రబాబుతో నేడు పయ్యావుల ములాఖత్
  • చంద్రబాబు మానసికంగా మరింత దృఢంగా తయారయ్యారని వెల్లడి
  • ప్రజల గురించి, పార్టీ గురించే మాట్లాడారని స్పష్టీకరణ

టీడీపీ అధినేత చంద్రబాబును ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పయ్యావుల జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు.

ప్రత్యర్థులు ఆయనను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నారని, కానీ ఆయన జైల్లో మానసికంగా మరింత దృఢంగా తయారయ్యారని వెల్లడించారు. ఇవాళ ములాఖత్ లో ఆయన తనతో మాట్లాడిన ప్రతి మాట రాష్ట్రం కోసమేని తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది చంద్రబాబు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారని పయ్యావుల పేర్కొన్నారు. పార్టీకి కూడా ఆయన ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని వివరించారు. 

"ప్రజా సమస్యలపై పోరాట పంథాను వీడొద్దండీ అని చెప్పారు. ఇవాళ నన్ను జైల్లో పెట్టారు... అంతటితో అది అయిపోయింది... మనది ఒక రాజకీయ పార్టీ... ప్రజాసంక్షేమమే మన లక్ష్యం కాబట్టి ప్రజాసమస్యలపై మన పోరాటం కొనసాగాలి... మన మార్గమెప్పుడూ ప్రజలకు చేరువగానే ఉండాలి, ప్రజలతోనే సాగాలి అని సూచించారు. ప్రజలకు మేలు జరగడం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. 

ఆయన ఎక్కడా కూడా తన గురించి, తన కేసుల గురించి మాట్లాడలేదు. ఇవాళ కాకపోతే రేపు బయటికి వస్తానన్న ధీమా ఆయనలో ఉంది. రాష్ట్రం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, పార్టీ ఎలా నడుస్తోంది అని మాత్రమే ఆయన ఆలోచిస్తున్నారు. 

చంద్రబాబును చూడగానే కొద్దిసేపు బాధ కలిగినా, ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చూశాక మాకు ధైర్యం వచ్చింది. కృష్ణా జలాలకు సంబంధించి పోలవరం అంశంలో నేను ప్రజల్లో తిరుగుతూ పోరాడడం, నా పర్యటనలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడమే ఈ పరిణామాలకు మూలం అని చంద్రబాబు వివరించారు. నన్ను అడ్డుకునేందుకు తొలుత అంగళ్లులో కేసుతో మొదలుపెట్టారు. ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని మనం ఎత్తిచూపిస్తున్నందుకే ప్రభుత్వంలో మార్పు వచ్చింది. నన్ను కట్టడి చేయడం కష్టమని భావించే నంద్యాలలో అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు" అంటూ పయ్యావులు ములాఖత్  వివరాలను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News