Pakistan: షఫీక్, రిజ్వాన్ సూపర్ సెంచరీలు... రికార్డు ఛేజింగ్ తో శ్రీలంకను ఓడించిన పాకిస్థాన్
- వరల్డ్ కప్ చరిత్రలో పాక్ సరికొత్త రికార్డు
- శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాక్
- ఉప్పల్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పాక్ ఘనవిజయం
- ఇంగ్లండ్ రికార్డు బద్దలు
పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. శ్రీలంకతో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ 4 వికెట్లు కోల్పోయి మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ చేజింగ్. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్ జట్టుపై 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడీ రికార్డును పాక్ బద్దలు కొట్టింది.
పాక్ విజయంలో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ సూపర్ సెంచరీలతో కీలకపాత్ర పోషించారు. షఫీక్ 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 113 పరుగులు చేయగా, రిజ్వాన్ 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఓ దశలో పాక్ 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా... షఫీక్, రిజ్వాన్ జోడీ మూడో వికెట్ కు 180 పరుగులు జోడించి పాక్ విజయానికి బాటలు వేసింది. షఫీక్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సాద్ షకీల్ 31 పరుగులు చేశాడు. చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ తో పాక్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. ఇఫ్తికార్ 10 బంతుల్లో 4 ఫోర్లతో చకచకా 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రీలంక పేసర్ పతిరణ విసిరిన ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఇఫ్తికార్ మూడు ఫోర్లు బాదడం విశేషం.