Jaishankar: భారత్ తో కెనడా రహస్య చర్చలు?
- వాషింగ్టన్ లో జైశంకర్, మెలానీ జోలీ భేటీ
- ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన ఫైనాన్షియల్ టైమ్స్
- ద్వైపాక్షిక విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కెనడా తీరు కనిపిస్తోంది. ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించడమే కాకుండా.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టపై బురదజల్లే ప్రయత్నం చేసిన కెనడాకి, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కేవలం ప్రకటనలతో సరిపెట్టాయి. న్యూజిలాండ్ అయితే ప్రకటన కూడా చేయలేదు. ఈ అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తొందరపాటుతో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కెనడా ఆరోపణలను ఖండించిన భారత్, ఈ విషయంలో తమకు ఆధారాలు ఇస్తే పరిశీలిస్తామని ప్రకటించింది. తదనంతర పరిణామాలతో కెనడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కొన్ని రోజుల క్రితం వాషింగ్టన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ విషయాన్ని బ్రిటిష్ వార్తా పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. కాకపోతే ఈ భేటీని కెనడా, భారత్ ధ్రువీకరించలేదు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ అంశాన్ని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్టు మెలానీ ఈ నెల మొదట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. భారత్ తో నెలకొన్న ద్వైపాక్షిక ప్రతిష్టంభనను తొలగించుకునే ఉద్దేశ్యంతో కెనడా ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ తో వివాదాన్ని పెద్దది చేసుకోవాలని అనుకోవడం లేదని కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు.