- జ్వరం నుంచి కోలుకుంటున్న శుభ్ మన్ గిల్
- నేడు చెన్నై నుంచి అహ్మదాబాద్ కు ప్రయాణం
- పూర్తిగా కోలుకుంటే ఈ నెల 14న ఆడే అవకాశం
జ్వరం కారణంగా వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ కు దూరమైన శుభ్ మన్ గిల్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. జ్వరంతో గత ఆదివారం అతడు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. ప్లేటులెట్ల సంఖ్య లక్షలోపునకు తగ్గిపోయాయి. దీంతో చికిత్స కోసం హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. కోలుకోవడంతో సోమవారం రాత్రి అతడ్ని డిశ్చార్జ్ చేశారు. బుధవారం అతడు అహ్మదాబాద్ కు ప్రయాణం కానున్నట్టు సమాచారం.
అహ్మదాబాద్ లో ఈ నెల 14న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనుండడం తెలిసిందే. నేడు చెన్నై నుంచి అహ్మదాబాద్ కు చేరుకుని, గిల్ అక్కడే విశ్రాంతి తీసుకుంటాడని, అతడిపై బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణ ఉంటుందని ఈ విషయం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. దీంతో నేటి ఆఫ్ఘాన్-భారత్ మ్యాచ్ కు గిల్ అందుబాటులో ఉండడని అర్థమవుతోంది.
శుభ్ మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో ఆప్ఘానిస్థాన్ తో మ్యాచ్ లో టీమిండియా యశశ్వి జైస్వాల్ లేదంటే రుతురాజ్ గైక్వాడ్ లో ఒకరికి ఓపెనర్ గా చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే కప్ కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ లో గైక్వాడ్ ఓపెనర్ పాత్ర పోషించడం తెలిసిందే. పాకిస్థాన్ లో ఈ నెల 14వ తేదీ మ్యాచ్ నాటికి గిల్ కోలుకునే అవకాశాలున్నాయి. లేదంటే 19వ తేదీన పూణెలో జరిగే మ్యాచ్ కు అతడు అందుబాటులోకి రావచ్చు.