Ashok Babu: పాలన ముగింపు దశలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సున్నం పెట్టుకోవడం జగన్ కే నష్టం: అశోక్ బాబు
- 40 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదన్న అశోక్ బాబు
- 13 లక్షల ఉద్యోగుల్లో 1.30 లక్షల మందే వైసీపీ మద్దతుదారులని వ్యాఖ్య
- మిగిలిన 12 లక్షల మంది జగన్ ప్రభుత్వానికి బొక్క పెడతారన్న అశోక్
11వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా 40 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, 60 శాతం మంది పెన్షన్ దారులకు పెన్షన్లు పడలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. జీతాల వివరాలను ఇవ్వాలని ఆర్థికశాఖను అడిగితే స్పష్టమైన వివరాలను ఇవ్వలేదని అన్నారు. ప్రతి నెలా రూ. 5,500 కోట్ల వరకు చెల్లిస్తున్నామని... నిన్నటి వరకు రూ. 2,500 కోట్లు చెల్లించినట్టు ఆర్థిక శాఖ తెలిపిందని చెప్పారు. ఆర్థికశాఖ వెల్లడించిన ఈ వివరాలపై సీఎం జగన్ ఏం చెపుతారని ప్రశ్నించారు.
నెల జీతాలు, పెన్షన్లపై బతికేవారి గురించి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆలోచించరని మండిపడ్డారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అగ్నిపర్వతంలోని లావా మాదిరి వైసీపీ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయమని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్లినా తనకు తిరుగుండదని అనుకోవడం జగన్ మూర్ఖత్వమవుతుందని చెప్పారు.