Gudivada Amarnath: లోకేశ్ చేసిన తప్పుకు శిక్షపడటం ఖాయం: మంత్రి గుడివాడ అమర్నాథ్
- చంద్రబాబు ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదు... జైల్లో అన్న మంత్రి
- దొంగతనం చేసినవారు ఒక్కసారితో నిజం చెప్పరన్న గుడివాడ అమర్నాథ్
- ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం చేస్తూ సింపథీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదని, అక్రమాలకు పాల్పడి జైల్లో ఉన్నారని, నేరం చేసినవాళ్లు ఉండేందుకే జైళ్లు పెట్టారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దొంగతనం చేసినవారంతా ఒక్కసారితో నిజం చెప్పరన్నారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం చేస్తూ సింపథీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
సీఐడీ విచారణ తర్వాత లోకేశ్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దొంగతనం చేసిన వాళ్లు ఎవరైనా ఒక్కసారి అడిగితే నిజం చెప్పరన్నారు. సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్న లోకేశ్ వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందిస్తూ... సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే తిరుగుతాయన్నారు. అంతేకానీ లోకేశ్ కుటుంబం యోగక్షేమాల గురించి కాదని సెటైర్ వేశారు. హెరిటేజ్ కోసం అమరావతిలో పద్నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినప్పుడు లోకేశ్ ఎందుకు సంతకం పెట్టారు? అని ప్రశ్నించారు. మేధావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరన్నారు. లోకేశ్ తప్పుకి శిక్షపడ్డం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పు చేశాడని కోర్టు నమ్మింది కాబట్టే చంద్రబాబు ఇంకా జైల్లో ఉన్నారన్నారు.