Dhulipala Narendra Kumar: ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర: ధూళిపాళ్ల నరేంద్ర
- దర్యాప్తు అధికారిని ఎందుకు మార్చారో సీఎం జవాబు చెప్పాలన్న ధూళిపాళ్ల
- ఇందులో ప్రభుత్వ పాత్ర స్పష్టంగా తెలుస్తోందని వెల్లడి
- సీఎంకు దాసోహమైన అధికారులపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని హెచ్చరిక
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పుడు మార్గాల్లో చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే జగన్ సర్కార్ దర్యాప్తు అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ చేస్తున్న అధికారిని ఉన్నపళంగా ఎందుకు మార్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజ్ ను మార్చి, డీఎస్పీ స్థాయి విజయ్ భాస్కర్ ను ఎందుకు నియమించారో ప్రభుత్వం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
"అధికారి మార్పుని బట్టే... ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో ప్రభుత్వ పాత్ర ఉందని స్పష్టమవుతోంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ కీలక దశలో ఉందని చెప్పే ప్రభుత్వం... అర్థం పర్థం లేకుండా విచారణాధికారుల్ని ఎందుకు మారుస్తోంది? తాము చెప్పినట్టు వినడం లేదనే జయరాజ్ ను తప్పించారా? అధికారిని మార్చడం ద్వారా ప్రభుత్వం పెద్ద కుట్రకు ప్రణాళికలు వేస్తోందని అర్థమవుతోంది. దర్యాప్తు అధికారిని మార్చి అతని ద్వారా తాము అనుకునేది చక్కబెట్టుకోవాలని ప్రభుత్వం అనుకుంటే, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది. అలాగే పరిధి దాటి వ్యవహరించే అధికారులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ రాజకీయ కుట్రలతో ఆడించే ఆటలపై... వాటిలో పావులుగా మారి, ముఖ్యమంత్రికి దాసోహమైన అధికారులపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుంది” అని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.
ఆ పేటెంట్ హక్కులు పూర్తిగా ముఖ్యమంత్రివే!
"ముఖ్యమంత్రి, ప్రభుత్వం మోపే అన్ని అభియోగాలు, అభాండాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా సమాధానం చెబుతూనే ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వాస్తవాలను అన్ని రూపాల్లో ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అవేవీ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కనిపించవు. కేవలం చంద్రబాబు జైల్లో ఉండాలి... తాము ఆనందించాలన్నదే వారి లక్ష్యం. చంద్రబాబు అరెస్ట్ పై, ఆయన జైల్లో ఉండటంపై మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, మరికొందరి వ్యాఖ్యలు వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే మంత్రులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. చంద్రబాబునాయుడి భద్రత, జైల్లోని పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం మంత్రులకు హాస్యంగా కనిపిస్తోంది" అని ధూళిపాళ్ల మండిపడ్డారు.