Devineni Uma: చంద్రబాబు రిమాండ్‌ను పొడిగింపచేసేందుకు వైసీపీ ప్రయత్నాలు: దేవినేని ఉమ
- చంద్రబాబు రిమాండ్ పొడిగింపుకు కోర్టుల్లో లిటిగేషన్లు క్రియేట్ చేస్తున్నారని విమర్శ
- జగన్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్న దేవినేని ఉమ
- పక్క రాష్ట్రం నాయకులతో కుమ్మక్కై అరాచకాలు చేస్తున్నారని ధ్వజం
తమ పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడానికి పలు న్యాయస్థానాల్లో లిటిగేషన్ల మీద లిటిగేషన్లు క్రియేట్ చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మైలవరంలోని గణేష్ గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ అరాచకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఎన్నికల్లో ఒక పార్టీకి సహకరించడానికి జగన్ ఉద్దేశపూర్వకంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించేందుకు లిటిగేషన్లు క్రియేట్ చేస్తున్నారని, డాక్యుమెంట్స్ ఉన్నాయని, లేవని కోర్టులో ఉద్దేశపూర్వకంగా సాగదీస్తూ పక్క రాష్ట్రం నాయకులతో కుమ్మక్కై అరాచకాలు చేస్తున్నారన్నారు.
విద్యార్థుల విషయంలో జగన్ కంస మామ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో ఒక గురుకుల పాఠశాలను నిర్మించారా? అని ప్రశ్నించారు. పిచ్చోడు విశాఖపట్నం వెళ్తున్నారు కాబట్టి మంచోళ్లను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థలను దెబ్బతిసే విధంగా జగన్ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇన్నర్ రింగు రోడ్డు మీద అవినీతి ఆరోపణలతో లోకేశ్‌ను రెండు రోజులుగా సీఐడీ విచారణకు పిలిపించి పైశాచిక ఆనందం పొందుతోందన్నారు.
కక్షపూరిత వైఖరి, కుట్రపూరితంగా విశాఖపట్నం వెళ్లేందుకు అమరావతిని చంపేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి లక్షకోట్ల ఆస్తి పంపకాలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను తాకట్టు పెట్టి కోర్టులకు వెళ్తానని డ్రామాలు మొదలు పెట్టారన్నారు. కృష్ణా జలాలపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్న లేవనెత్తినప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రైతాంగం గొంతు కోసేశారన్నారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టు, రాయలసీమ రైతాంగం, నెల్లూరు రైతాంగాన్ని జగన్ నట్టేట ముంచారన్నారు.