anurag thakur: యువత కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త పథకం
- యువతకు నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కొత్త పథకం
- మేరా యువ భారత్/మై భారత్ పేరుతో స్వయంప్రతిపత్తి కలిగిన వేదిక
- అక్టోబర్ 31న కార్యక్రమం ప్రారంభం
యువత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేరా యువ భారత్/మై భారత్ పేరుతో ఓ స్వయంప్రతిపత్తి కలిగిన వేదికను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం లక్ష్యం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో పంచుకున్నారు.
యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మేరా యువ భారత్ లక్ష్యమని తెలిపారు. యువత తమకు కావాల్సిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ వేదిక ద్వారా 15 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్రయోజనం ఉంటుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే, కేబినెట్ భేటీలో కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం మూడు శాతం, అరుదుగా లభించే మరో ఖనిజంకు ఒక శాతం రాయల్టీ విధించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.