israel: ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలోని విద్యుత్ ప్లాంట్ మూసివేత.. అంధకారంలో నగరం
- హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడి
- ఇంధన నిల్వలు నిండుకోవడంతో విద్యుత్ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన
- ఇజ్రాయెల్ ఇంధన సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో జనరేటర్ ఆధారిత ఇళ్లు, ఆసుపత్రులు
తమపై హమాస్ తీవ్రవాదులు దాడి చేయడంతో ఇజ్రాయెల్ దీటుగా స్పందిస్తోంది. హమాస్ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా గాజాపై దాడులను తీవ్రం చేసింది. ఈ క్రమంలో గాజాలో ఉన్న ఒకే ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేశారు. ఇంధన నిల్వలు నిండుకోవడంతో నిలిపివేస్తున్నట్లు సంబంధిత సంస్థ తెలిపింది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఇంధన సరఫరాను నిలిపివేయడంతో జనరేటర్ ఆధారిత ఇళ్లు, ఆసుపత్రులు సహా గాజా పూర్తి అంధకారంలోకి వెళ్లనుంది.
తమపై హమాస్ ఉగ్రదాడి నేపథ్యంలో వారి స్థావరాలకు విద్యుత్ నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న గాజాను అష్టదిగ్బంధం చేసింది. విద్యుత్, ఆహారం, ఔషధాలతో పాటు ఇంధన సరఫరాను నిలిపివేసింది. గాజా సరిహద్దులను మూసివేసింది. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో ఇక్కడ ఉన్న ఒకే ఒక విద్యుదుత్పత్తి కేంద్రం మూతబడింది.