KTR: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు
- తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు
- నిన్న, ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
- దేవరకొండ కాంగ్రెస్ నేత బిల్యానాయక్ కు పార్టీ కండువా కప్పిన కేటీఆర్
- కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ లో నిన్న, ఇవాళ చేరికలు జరిగాయి. నిన్న హుజూర్ నగర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, నల్గొండ నేత చకిలం అనిల్ కుమార్ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.
నేడు కూడా కేటీఆర్ సమక్షంలో పలు చేరికలు చోటుచేసుకున్నాయి. దేవరకొండ కాంగ్రెస్ నేత కేతావత్ బిల్యానాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బిల్యానాయక్ కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బిల్యానాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చిందని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు.
గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు రేటు అంటూ రేవంత్ రెడ్డిపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ అని కాకుండా రేటెంత అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్ లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పింది రేవంత్ కాదా? అని ప్రశ్నించారు.