Muhammad Rizwan: మా విజయం గాజా ప్రజలకు అంకితం: పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్
- నిన్న వరల్డ్ కప్ లో శ్రీలంకపై పాక్ జయభేరి
- ఇజ్రాయెల్ ను దారుణంగా దెబ్బతీసిన హమాస్
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో గాజా అతలాకుతలం
- గాజా ప్రజలకు మద్దతు ప్రకటించిన పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్
భారత్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో నిన్న పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై అమోఘమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఘనవిజయం సాధించింది. 345 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (113) సెంచరీల సాయంతో పాక్ విజయభేరి మోగించింది.
కాగా, ఈ విజయాన్ని గాజా ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు మహ్మద్ రిజ్వాన్ ప్రకటించాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య తీవ్రస్థాయిలో దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్... గాజాను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాలోనూ మృతుల సంఖ్య భారీగా నమోదైంది. ఈ నేపథ్యంలో, పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ తమ మద్దతు గాజాకేనని తన వ్యాఖ్యల ద్వారా చాటాడు.
"ఈ విజయం గాజాలోని మా సోదరులు, సోదరీమణులకు అంకితం ఇస్తున్నాం. పాకిస్థాన్ విజయంలో నా పాత్ర కూడా ఉండడం సంతోషం కలిగిస్తోంది. ఈ ఘనత జట్టు మొత్తానికి చెందుతుంది... ముఖ్యంగా, ఈ విజయం సునాయాసంగా లభించేందుకు కారకులైన అబ్దుల్లా షఫీక్ కు, హసన్ అలీకి అభినందనలు. మేం హైదరాబాదులో ఉన్న ఈ కొన్నిరోజుల పాటు ఇక్కడి ప్రజల ఆదరణ, మద్దతు నిజంగా అమోఘం. అపూర్వమైన రీతిలో మాకు ఆతిథ్యం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం" అని రిజ్వాన్ ఎక్స్ లో స్పందించాడు.