Operation Ajay: ఇజ్రాయెల్ లో చిక్కుకున్న మన వాళ్లను రప్పించేందుకు 'ఆపరేషన్ అజయ్' ప్రారంభం
- ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం
- ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో చిక్కుకున్న భారతీయులు
- ఈరోజు నుంచే ఆపరేషన్ అజయ్ ప్రారంభం
ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో విదేశీయులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, ఇతరులు ఉన్నారు. టూరిజం కోసం వెళ్లిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా మన దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలను చేపట్టింది. మన పౌరుల కోసం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. మన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. ఈ రోజు నుంచే ఆపరేషన్ అజయ్ ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం అధికార ప్రకటన చేసింది. గతంలో ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను రప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టిన సంగతి తెలిసిందే.