Shubman Gill: టీమిండియాకు శుభవార్త... బ్యాటింగ్ ప్రాక్టీసు ప్రారంభించిన శుభ్ మాన్ గిల్
- డెంగీ జ్వరం నుంచి కోలుకున్న గిల్
- అహ్మదాబాద్ లో నెట్స్ లో కనిపించిన వైనం
- ఎల్లుండి పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్
- గిల్ బరిలో దిగడంపై అనిశ్చితి
ఇటీవల డెంగీ బారినపడి వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లకు దూరమైన టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ కోలుకున్నాడు. అంతేకాదు, నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు. టీమిండియాకు నిజంగా ఇది శుభవార్తే.
ఈ నెల 14న టీమిండియా అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ నాటికి గిల్ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. డెంగీ కారణంగా ప్లేట్ లెట్లు తగ్గడంతో, గిల్ కు అందుకు తగిన చికిత్స అందించారు. గిల్ ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్నప్పటికీ పూర్తి ఫిట్ నెస్ సంతరించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దాంతో, పాకిస్థాన్ పై అతడు బరిలో దిగే అవకాశాలు స్వల్పమే.
పాక్ తో పోరు తర్వాత టీమిండియా వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర జట్లతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, పాక్ తో మ్యాచ్ కు గిల్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.