Accenture: భారత టెక్కీలకు వేతన పెంపు, పదోన్నతులకు యాక్సెంచర్ బ్రేక్
- ఈ ఏడాది వేతన పెంపు, బోనస్ చెల్లింపులు ఉండవన్న యాక్సెంచర్
- కీలక నైపుణ్యాలతో కూడిన విభాగాలకు ఇది వర్తించదని వెల్లడి
- శ్రీలంకలోని ఉద్యోగులకూ వర్తిస్తుందన్న యాక్సెంచర్
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. భారత్‌లోని తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపు, బోనస్ చెల్లింపులు ఉండవని తెలిపింది. భారత్‌తో పాటు శ్రీలంకలోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. కీలక నైపుణ్యాలతో కూడిన విభాగాలకు ఇది వర్తించదని వెల్లడించింది. ఈ మేరకు యాక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు సమాచారం చేరవేశారు. ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో యాక్సెంచర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
యాక్సెంచర్ వృద్ధి అంచనాలకు అనుగుణంగా లేకపోవడం నిరాశకు గురి చేసింది. 2023 మార్చిలో పందొమ్మిదివేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నైపుణ్యాలు, పని ప్రదేశం ఆధారంగా వేతనం అందించేలా యాక్సెంచర్ వేతన చెల్లింపులు ఉంటాయని, ఈ ఏడాది ఉద్యోగులకు వేతన పెంపును కంపెనీ చేపట్టడం లేదని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో కంపెనీ ఎండీ అజయ్ విజ్ పేర్కొన్నారు. మరోవైపు, పదోన్నతులను కూడా కంపెనీ కుదిస్తోంది. ఒకటి నుంచి నాలుగు లెవల్స్ వరకు పదోన్నతులను 2024 జూన్ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.