Pattabhi: ఓసారి మా ఆఫీసుకు వస్తే సజ్జల నోరు మూయిస్తాం: పట్టాభి
- ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై పట్టాభి ప్రెస్ మీట్
- సజ్జలకు కళ్లు, చెవులతో పాటు మెదడు కూడా పనిచేయడంలేదని విమర్శలు
- సజ్జల పిచ్చికూతలు కూస్తున్నాడని ఆగ్రహం
చంద్రబాబుపై జగన్ రెడ్డి, అతని జేబు సంస్థ సీఐడీ పెట్టిన కేసులు తప్పని నిరూపించడానికి టీడీపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం చూస్తే అతనికి కళ్లు చెవులతో పాటు మెదడు కూడా పనిచేయడం లేదని అర్థమైందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
నెల రోజులకు పైగా ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు సంబంధించి కట్టలకొద్దీ పత్రాలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, apskill devolopmenttruth.com వంటి వెబ్ సైట్ ను ప్రజల ముందు ఉంచామని, అయినప్పటికీ ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయడం కూడా తెలియక, దానిలోని సమాచారాన్ని గ్రహించే జ్ఞానంలేకనే టీడీపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సజ్జల పిచ్చికూతలు కూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జలకు వెబ్ సైట్లు కూడా ఓపెన్ చేసి, వాస్తవాలను పరిశీలించే కనీస పరిజ్ఞానం లేకపోతే, తమ కార్యాలయానికి వస్తే పెద్ద డిజిటల్ స్క్రీన్ పై ఆధారాలు ప్రదర్శించి మరీ ఆయన నోరు మూయిస్తామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ బయటపెట్టే వాటికి సమాధానం చెప్పడం చేతగాక... చేతిలో నీలిమీడియా ఉందని, తామేం చెప్పినా ప్రజలు నమ్ముతారని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల, ముఖ్యమంత్రి అనుకుంటే కుదరదని పట్టాభి స్పష్టంచేశారు.
తక్కువ ఖర్చుతో కేబుల్ వేయడమే గాక, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ DWDMను చంద్రబాబు ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలోనే మొదటిసారి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక రాష్ట్రానికి టెలికం లైసెన్స్ దక్కిందని పేర్కొన్నారు. లక్షలాది యువత జీవితాలు బాగుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఏ విధంగా నేటి ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో బురద జల్లుతోందో, అదే విధంగా చంద్రబాబు కోట్లాదిరూపాయలు అదా చేసిన ప్రాజెక్ట్ పైనా విషం కక్కుతున్నారని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక పునాదిగా అతి తక్కువ ఖర్చుతో చంద్రబాబు పూర్తి చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫలితాలు ఇప్పటికే మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని పట్టాభి స్పష్టం చేశారు.
చంద్రబాబును కస్టడీకి కోరడం విచిత్రంగా ఉంది
దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్టిన ఖర్చుకంటే చాలా తక్కువగా దాదాపు 1/4 శాతం వ్యయంతోనే చంద్రబాబు ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలుచేసి కేంద్రప్రభుత్వమే ముక్కున వేలేసుకునేలా చేశారు.
నాటి ఏపీ ప్రభుత్వం దేశంలో తొలిసారి బీఎస్ఎన్ఎల్ తర్వాత టెలికం లైసెన్స్ సాధించిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించి ‘797’ తో మొదలయ్యే ప్రత్యేక సిరీస్ తో టెలిఫోన్ సేవల్ని స్వయంగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని ఆనాడు జాతీయ మీడియాలో కూడా పెద్దఎత్తున ప్రశంసాపూర్వకమైన కథనాలు వచ్చాయి.