Janasena: అమిత్ షాను లోకేశ్ కలవడంపై వైసీపీకి జనసేన నేత కౌంటర్
- ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరైనా కలిసే హక్కు ఉందన్న జనసేన నేత
- తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి మహిళల గురించి మాట్లాడటం విడ్డూరమన్న కందుల దుర్గేశ్
- ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం
- పేదల పక్షాన నిలబడే పవన్ నిజంగా పేదవాడేనని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన నేత కందుల దుర్గేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సామర్లకోట సభలో జగన్ సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారని ఆరోపించారు. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను ఆటవస్తువులా భావించి వికృత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
జగన్ తన ప్రసంగంలో సగం సమయం తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించేందుకే కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పేదల పక్షాన నిలబడిన పవన్ నిజంగా పేదవాడే అన్నారు. జగన్‌కు బెంగళూరు, హైదరాబాద్, కడపలలో ఆస్తులు ఉండవచ్చు... మిగిలిన వారికి ఉండవద్దా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. జనసేన-టీడీపీ పొత్తుతో జగన్‌లో వణుకు పుట్టిందన్నారు. వైసీపీ బస్సు యాత్ర అంటోందని, ఎమ్మెల్యేలు బస్సులో వెళ్తే జగన్ మాత్రం హెలికాప్టర్‌లో వెళ్తారని మండిపడ్డారు.
నారా లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంపై వైసీపీ విమర్శలు చేయడం మీద ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరైనా కలిసే హక్కు ఉందన్నారు. అందులో భాగంగానే అమిత్ షాను లోకేశ్ కలిశారన్నారు. ఇక రాజకీయాల్లో పొత్తులు సహజమని, రాక్షస సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసిన సందర్భాలు విన్నామన్నారు.