Anand Mahindra: భారత సైనికులకు ఇది విక్రమ్ ల్యాండర్ అంతటి ముఖ్యమైంది: ఆనంద్ మహీంద్రా
- సియాచెన్‌లో సైనికుల కోసం తొలి మొబైల్ కమ్యూనికేషన్ టవర్ ఏర్పాటు
- ఇకపై సైనికులకు తమ కుటుంబాలతో మాట్లాడటం మరింత సులభవం
- మొబైల్ టవర్ ఫొటోలను నెట్టింట షేర్ చేసిన ఆనంద మహీంద్రా
- ఈ చిన్న పరికరం సైనికులకు విక్రమ్ ల్యాండర్ అంతటి ముఖ్యమైనదని వ్యాఖ్య
మనదేశంలో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉండే సరిహద్దు ప్రాంతం ఏదైనా ఉందీ అంటే అది జమ్మూకశ్మీర్‌లోని సియాచెన్ ప్రాంతమే! ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న యుద్ధ క్ష్రేత్రం! భారీ మంచు పర్వతాలపై శ్వాస తీసుకునేందుకు సరైన ప్రాణవాయువు కూడా లేని ఆ ప్రాంతంలో భారత సైనికులు దేశ రక్షణ విధులు నిర్వర్తిస్తుంటారు. ఇంతకాలం అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు సరిగా లేకపోవడంతో వారు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కష్టమయ్యేది. ఈ కష్టాలను తీర్చేలా అక్కడ తాజాగా మొట్టమొదటి మొబైల్ కమ్యూనికేషన్ టవర్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవుసింహ్ చౌహాన్ షేర్ చేసిన ఫొటోలను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ఫాలోవర్లతో పంచుకున్నారు.
‘‘సియాచెన్‌లో మొదటి మొబైల్ టవర్ ఏర్పాటుకు సంబంధించిన ఫొటోలు ఇవి. కేంద్ర మంత్రి షేర్ చేశారు. నిత్యం అల్లకల్లోలంగా ఉండే ఈ ప్రపంచంలో ఇది ఓ చిన్న ఘటనే. కానీ దేశ రక్షణ కోసం ప్రతిరోజు ప్రాణాలు పణంగా పెడుతూ యుద్ధసన్నద్ధతతో ఉండే సైనికులకు ఇది ఎంతో గొప్ప క్షణం. సైనికుల కుటుంబాలను వారికి మరింతగా దగ్గర చేసింది. ఈ చిన్న పరికరం వారికి విక్రమ్ ల్యాండర్ అంత ముఖ్యమైనది. నన్నడిగితే ఇది నిజంగా చాలా పెద్ద వార్త’’ అని కామెంట్ చేశారు. సాంత్వన కలిగించే కుటుంబసభ్యుల గొంతు సైనికులకు చేరువైనందుకు నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.