medical attention: చంద్రబాబు నాయుడి గారికి అత్యవసర వైద్యం అవసరం: నారా బ్రాహ్మణి
- అపరిశుభ్ర, వసతుల్లేమి మధ్య చంద్రబాబుగారిని నిర్బంధించడంపై ఆందోళన
- 5 కిలోల మేర బరువు తగ్గినట్టు వెల్లడి
- మరింత క్షీణిస్తే కిడ్నీలపై ప్రభావం పడుతుందన్న నారా బ్రాహ్మణి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల, ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్ తో బాధపడుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, నారా బ్రాహ్మణి నేడు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘గుండె తరుక్కుపోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తగిన సదుపాయాల్లేని, అపరిశుభ్ర కారాగార పరిస్థితుల మధ్య నిర్బంధంలో ఉన్నారు. అది ఆయన ఆరోగ్యానికి ఆందోళనకర రిస్క్ ను తీసుకొస్తుంది. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేసినందున అత్యవసర వైద్య పర్యవేక్షణ అవసరం ఇప్పుడు ఏర్పడింది. సకాలంలో వైద్య సంరక్షణ అందించడం లేదు. ఆయన 5 కిలోల మేర బరువు తగ్గారు. మరింత బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. ఆయన ఆందోళన గురించి మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం’’ అని బ్రాహ్మణి తన పోస్ట్ లో పేర్కొన్నారు.