Chandrababu: ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్, స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్లపై సుప్రీంలో విచారణ ప్రారంభం
- రెండు పిటిషన్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది
- చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు
- ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ ప్రారంభమయింది. ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై కూడా ఈరోజు సుప్రీం విచారించనుంది. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది. బాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.
మరో కేసులో చంద్రబాబును ఈ నెల 16న కోర్టులో ప్రవేశ పెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని కోర్టుకు లూథ్రా తెలిపారు. కేసులపై కేసులు పెడుతూ సర్కస్ ఆడిస్తున్నారని చెప్పారు. ప్రతి చోటా 17ఏ వర్తిస్తుందని అన్నారు. ముకుల్ రోహత్గి వాదిస్తూ... నేరం ఎప్పుడు జరిగిందో అప్పటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. నేరం ఐదేళ్ల క్రితం జరిగినా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని అన్నారు.