Chandrababu: చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెట్టి సర్కస్ ఆడిస్తున్నారు: సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూథ్రా
- స్కిల్ కేసు విచారణకు ఫైబర్ కేసుతో సంబంధం ఉందన్న లూథ్రా
- మరో కేసులో చంద్రబాబును 16న కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని సుప్రీంకోర్టుకు తెలిపిన న్యాయవాది
- సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం విచారణ సాగుతోంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ... స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణకు ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉందన్నారు. మరో కేసులోను చంద్రబాబును 16వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని కోర్టుకు తెలిపారు.
చంద్రబాబుపై కేసు మీద కేసు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని... ఇక్కడ కూడా 17ఏను ఛాలెంజ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దానికి సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ... అవును, 17ఏ ప్రతిచోట వర్తిస్తుందన్నారు.
అనంతరం సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగినప్పుడు ఉన్న చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే ఈ నేరం జరిగిందన్నారు. కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని వాదించారు. ఈ సందర్భంగా జస్టిస్ అనిరుద్ధబోస్ కల్పించుకొని... ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసు మీద కేసు ఎలా ఫైల్ చేస్తారని ప్రశ్నించారు. దీనికి ముకుల్ రోహత్గీ స్పందిస్తూ... ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందన్నారు.