Sajjala Ramakrishna Reddy: నారా లోకేశ్ నాయుడు అనే వ్యక్తి నిన్న, ఇవాళ చేసిన డ్రామా చూస్తే దిమ్మదిరిగిపోయేలా ఉంది: సజ్జల
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సజ్జల ప్రెస్ మీట్
- ఢిల్లీలో అమిత్ షాతో లోకేశ్ భేటీపైనా అభిప్రాయాలు పంచుకున్న సజ్జల
- వీళ్ల డ్రామా ఒక్కోసారి పీక్స్ కు చేరుతుందని వెల్లడి
- వీళ్లు దేనికైనా సిద్ధమేనని వ్యాఖ్యలు
రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి చుట్టూ ముసురుకున్న అంశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు.
నారా లోకేశ్ నాయుడు అనే వ్యక్తి నిన్న, ఇవాళ ఢిల్లీలో చేసిన డ్రామా చూస్తే దిమ్మదిరిగిపోయిందని వ్యాఖ్యానించారు. వీళ్ల డ్రామా ఒక్కోసారి పరాకాష్ఠకు చేరుతుందని, ఒక్కోసారి బేలగా కిందపడతారని వివరించారు. వీళ్లు ఎలాగైనా మారతారని... ఒక్కోసారి మీసం మెలేసి తొడ కొట్టి మాట్లాడతారని, ఒక్కోసారి కాళ్లు పట్టుకుని పైరవీలు చేస్తుంటారని సజ్జల విమర్శించారు.
నిన్న ఢిల్లీలో లోపల (అమిత్ షాతో) ఏం మాట్లాడారో గానీ, బయటికొచ్చి చిట్ చాట్ పేరిట పేర్కొన్న విషయాలు చూస్తే దిమ్మదిరిగేలా ఉన్నాయని అన్నారు. ఈనాడు, జ్యోతిలో సొంత భాష్యం చెబుతూ రాశారు... అమిత్ షాకు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది.... లేకపోతే వీళ్ల పైత్యం చూసి ఏమనుకునేవారో! అంటూ సజ్జల వ్యంగ్యం ప్రదర్శించారు.
లోకేశ్ చెప్పాడంటూ సదరు పత్రికల్లో చిట్ చాట్ పేరిట వచ్చిన అంశాలు చూస్తే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడంలేదని సజ్జల అన్నారు. "లోకేశ్ తో మాట్లాడాలని అమిత్ షానే ఓ మెసేజ్ పంపించాడట. దాంతో ఈయన వెళ్లాడట. ఈయన (లోకేశ్) సీఎం జగన్ గురించి, ఇక్కడి పరిణామాల గురించి ఏమేం అనాలనుకుంటున్నాడో అవన్నీ అమిత్ షానే అన్నట్టు పత్రికల్లో కనిపిస్తోంది. ఈయన (లోకేశ్) మాటలు చూస్తుంటే... చంద్రబాబు అరెస్ట్ వెనుక తానున్నాను లేదా బీజేపీ ఉంది అనే అపవాదును తొలగించుకోవడానికే లోకేశ్ ను అమిత్ షా ఢిల్లీకి పిలిపించినట్టుంది" అంటూ సజ్జల పేర్కొన్నారు.