Ravi Shastri: వరల్డ్ కప్ లో రేపు భారత్, పాకిస్థాన్ అమీతుమీ... భారత ఓపెనర్లకు రవిశాస్త్రి సూచన
- వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికర సమరానికి సర్వం సిద్ధం
- రేపు అహ్మదాబాద్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- మేనియాతో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులు
- దాయాదుల సమరంపై రవిశాస్త్రి ప్రత్యేక విశ్లేషణ
వరల్డ్ కప్ లో రేపు అతి పెద్ద మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 5న వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటికీ, హైప్ అంతా అక్టోబరు 14న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పైనే నెలకొంది. దాయాదుల సమరం మేనియాతో క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారు. అభిమానుల సంగతి అలా ఉంచితే, ఇరు జట్ల క్రికెటర్లు ఎంత టెన్షన్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో, టీమిండియా క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించారు.
ఈ హై ఫై మ్యాచ్ ఫలితం అంతా కొత్తబంతిని ఎలా ఎదుర్కొంటారన్న అంశంపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, టీమిండియా ఓపెనర్లు పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదిని ఎలా ఎదుర్కొంటారన్నది చాలా ముఖ్యమైన అంశం అని వివరించారు.
"ఈ పోరులో కొత్తబంతితో పేస్ దాడులను ఎదుర్కోడం నిజంగా ఓ పరీక్ష. ఈ సవాల్ ను తట్టుకుని నిలబడగలిగిన వాళ్లు మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తారు" అని రవిశాస్త్రి రేపటి మ్యాచ్ ను విశ్లేషించారు. ఇక, టీమిండియా టాపార్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతో కీలకం అని అభిప్రాయపడ్డారు. వీళ్లిద్దరూ రాణించి, వీరిలో ఒకరు సెంచరీ కొడితే టీమిండియా గరిష్ఠంగా 330 వరకు స్కోరు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
పాకిస్థాన్ కు కూడా ఇదే వర్తిస్తుందని, వారి టాపార్డర్ లో కెప్టెన్ బాబర్ అజామ్ రాణిస్తేనే భారీ స్కోరుకు మార్గం సుగమం అవుతుందని రవిశాస్త్రి వివరించారు.
భారత పేసర్ల గురించి చెబుతూ, బుమ్రా మంచి లయతో బౌలింగ్ చేస్తుంటే చూడ్డానికి థ్రిల్లింగ్ గా ఉంటుందని పేర్కొన్నారు. ఇక సిరాజ్ లో యువరక్తం ఉరకలు వేస్తోందని, తన బౌలింగ్ కు మరింత మెరుగులు దిద్దుకున్నాడని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకారి బౌలర్ గా రూపొందాడని తెలిపారు. బంతితో అద్భుతాలు చేయగల సత్తా సిరాజ్ సొంతమని అన్నారు. స్వింగ్ చేయడం, మంచి సీమ్ పొజిషన్ తో బంతులు సంధించడం సిరాజ్ కు సహజంగా అబ్బిన విద్య అని వివరించారు. బుమ్రా, సిరాజ్ రాణిస్తే రేపటి మ్యాచ్ లో భారత ప్రస్థానం నల్లేరుపై నడకేనని శాస్త్రి అభిప్రాయపడ్డారు.
ఇదే సూత్రం పాకిస్థాన్ జట్టులోని షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ పేస్ జోడీకి కూడా వర్తిస్తుందని వెల్లడించారు. ఒకరు స్వింగ్ తో, ఒకరు వేగంతో దెబ్బతీస్తారని తెలిపారు. మ్యాచ్ లో ఏ దశలోనైనా వీళ్లు చెలరేగిపోతారని, వీళ్లిద్దరిది ఉద్విగ్నభరిత జోడీ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
తాము క్రికెట్ ఆడే రోజుల్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రమం తప్పకుండా మ్యాచ్ లు జరిగేవని వెల్లడించారు. ఇప్పుడలా కాదని, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇరుజట్లు ఆడుతుండడం వల్ల అంచనాలు భారీగా ఉంటున్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లపైనా విపరీతమైన ఒత్తిడి ఉంటోందని తెలిపారు.
ముఖ్యంగా, రేపటి మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ అని శాస్త్రి స్పష్టం చేశారు. సొంతగడ్డపై ఆడుతుండడం, ఇరుజట్ల బలబలాల పరంగా టీమిండియానే మెరుగ్గా ఉందని విశ్లేషించారు.