Cricket: ఇక ఒలింపిక్స్ లోనూ క్రికెట్... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం
- ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలంటూ ఇటీవల ఐఓసీ ముందుకు ప్రతిపాదనలు
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఓసీ
- లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ కు స్థానం
- ప్రసార హక్కుల ద్వారా ఐఓసీకి భారీ ఆదాయం వచ్చే అవకాశం
ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ లో జనరంజక క్రీడ క్రికెట్ కు కూడా స్థానం కల్పించారు. అమెరికా నగరం లాస్ ఏంజెల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చారు. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.
ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న ప్రతిపాదన ఇప్పటిది కాదు. అనేక సంవత్సరాలుగా ఈ అంశం ప్రతిపాదనల వద్దే ఆగిపోతోంది. అయితే ఆసియా క్రీడల్లో క్రికెట్ కు ఆదరణ లభించిన విషయాన్ని ఐఓసీ కూడా గుర్తించింది.
తాజాగా ఐఓసీ ఆమోదం లభించిన నేపథ్యంలో, ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్ (ఓపీసీ) సమీక్ష ఒక్కటే మిగిలుంది. ఇది లాంఛనమే. ఈ సమీక్షలో ఓటింగ్ చేపట్టి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు క్రికెట్ ను ఒలింపిక్స్ చార్టర్ లో చేర్చుతారు.
క్రికెట్ ను చేర్చడం వల్ల ఒలింపిక్ కమిటీకి వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఒలింపిక్స్ ప్రసార హక్కులు వేలం వేస్తే ఐఓసీకి రూ.158 కోట్ల వరకు లభిస్తాయి. అదే సమయంలో ఒలింపిక్స్ పేరిట క్రికెట్ ప్రసార హక్కులను వేలం వేస్తే రూ.15 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ ఆదాయం ఒలింపిక్స్ నిర్వాహకులను ఊరిస్తోంది.
ఇక, లాస్ ఏంజెల్స్ ఆతిథ్యమిచ్చే ఒలింపిక్స్-2028లో క్రికెట్ తో పాటు స్క్వాష్, బేస్ బాల్, లాక్రోసీ, ఫ్లాగ్ ఫుట్ బాల్ క్రీడలకు కూడా స్థానం కల్పించేందుకు ఐఓసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.