KTR: ఈటల రాజేందర్ 50 చోట్ల పోటీ చేసినా పర్లేదు: కేటీఆర్
- కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారని చెప్పిన కేటీఆర్
- ఈసీ స్వతంత్రంగా పని చేస్తుందని కేసీఆర్ ఆశాభావం
- హుజూరాబాద్‌లోను బీఆర్ఎస్ గెలుస్తుందన్న కేటీఆర్
- షర్మిల 119 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదన్న మంత్రి
బీఆర్ఎస్కు గతంలోలా 88 సీట్లు రావచ్చునని, హుజూరాబాద్‌లోనూ తామే గెలుస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారన్నారు. తాను గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్ల, కామారెడ్డిలలో ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. తమ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్లకు పెద్ద పీట వేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగానే పని చేస్తుందని భావిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన అధికారుల బదలీలను సాధారణ బదలీలుగా చూస్తామని చెప్పారు.
కాంగ్రెస్ 2004, 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేదన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈటల గజ్వేల్‌తో పాటు మరో యాభై చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా, రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ ఇక్కడకు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు నలభై చోట్ల అభ్యర్థులే లేరన్నారు. అలాంటి కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్‌లో డబ్బులు పంచిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. కూకట్పల్లి టిక్కెట్ కోసం రూ.15 కోట్లు అడిగినట్లుగా తెలిసిందని, ఈ విషయమై ఓ కాంగ్రెస్ నేత తనతో చెప్పారన్నారు. కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోందని, తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.42 కోట్లు కాంగ్రెస్ కార్పోరేటర్ ఇంట్లో దొరికాయన్నారు. రూ.8 కోట్లు ఇప్పటికే కొడంగల్‌కు చేరినట్లుగా సమాచారం ఉందన్నారు.