Nakka Anand Babu: సజ్జల ప్రభుత్వ సలహాదారా... రాజమండ్రి జైలు సలహాదారా?: నక్కా ఆనంద్ బాబు ఫైర్
- చంద్రబాబు అంశంలో సజ్జల వ్యాఖ్యలు
- తీవ్రంగా ఖండించిన టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు
- మనిషనే వాడు ఎవడైనా సజ్జలలాగా మాట్లాడాతా అంటూ ఆగ్రహం
- జగన్ దేనికైనా తెగిస్తాడని వ్యాఖ్యలు
రాజమండ్రి జైల్లో చంద్రబాబు పరిస్థితిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సజ్జల తన నోటిదూల తీర్చుకోవడానికే విలేకరులతో మాట్లాడాడని, చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న ఆందోళనను కప్పిపుచ్చడం కోసం మనిషనేవాడు మాట్లాడని విధంగా సజ్జల మాట్లాడాడని మండిపడ్డారు.
ఇంటినుంచి తెప్పించుకునే భోజనంలో చంద్రబాబే ఏదో కలిపించుకొని ఉంటాడంటున్న సజ్జల.. గతంలో అలానే చేయమని జగన్ కు, అతని కుటుంబ సభ్యులకు చెప్పాడా? అని సూటిగా ప్రశ్నించారు. సజ్జల ప్రభుత్వ సలహాదారా... రాజమండ్రి జైలుకి సలహాదారా? అంటూ నిప్పులు చెరిగారు.
చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి, ఆయన్ని ఎప్పటికీ ప్రజల్లోకి రాకుండా చేయాలన్నదే జగన్ కుట్ర అని సజ్జల వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. బాబాయ్ ని అధికారంకోసం అడ్డగోలుగా చంపించిన జగన్ దేనికైనా తెగిస్తాడని అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడికి కనీస సౌకర్యాలుకూడా కల్పించరా? ఆఖరికి స్నానానికి వేడినీళ్లు, తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జలకు ఎందుకు మంట?
రాజమండ్రి జైలు పూర్తిగా సజ్జల అధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది!
సజ్జల వ్యాఖ్యలు విన్నాక రాజమహేంద్రవరం జైలు పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలో ఉందని అర్థమైంది. జైల్లో చంద్రబాబు విషయంలో అనుసరిస్తున్న తీరు... ఆయనకు అందిస్తున్న వైద్యసేవలు చూశాక, సజ్జల వ్యాఖ్యలు విన్నాక ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటున్న చంద్రబాబే, తనకి ఏదో అవ్వడానికి అనారోగ్యం కలిగేలా చేసుకున్నాడంటున్న సజ్జలకే గతంలో అలా చేసిన అనుభవం మెండుగా ఉన్నట్టుంది.
జగన్ జైల్లో ఉన్నప్పుడు అలానే చేయమని సజ్జల... ఖైదీ నెం 6093 కుటుంబసభ్యులకు చెప్పి నట్టు ఉన్నాడు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం పంపించమని న్యాయస్థానమే చెప్పింది, సజ్జలో.. ఈ సైకో ముఖ్యమంత్రో చెప్పలేదు.
చంద్రబాబుకి వచ్చే భోజనాన్ని జైలు అధికారులు పరిశీలించాకే లోపలికి పంపిస్తున్నారు. అలా తనిఖీ చేసేటప్పుడు ఈ ప్రభుత్వమే దానిలో ఏదైనా స్లో పాయిజన్ లాంటిది కలుపుతుందేమో అనే అనుమానం కలుగుతోంది. అలా చేసి చివరకు చంద్రబాబుని ప్రజల్లోకి రాకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారేమో అనే సందేహం ఉంది.
ఆ స్థాయిలో భోగాలు కావాలని చంద్రబాబు అడిగారా? సరైన నీళ్లు కూడా ఇవ్వకుండా ఆయన్ని వేధించడం వ్యక్తిగతంగా కక్షసాధించడం కాక ఏమిటి? జైలు అధికారుల్ని ఎందుకు మారుస్తున్నారు? కేవలం 30 రోజుల్లోనే ఇద్దరు జైలు ఇన్ ఛార్జ్ లను ఎందుకు తప్పించారు? తాటిమట్ల లాంటి నోళ్లేసుకొని అడ్డంగా మీడియా ముందుకొచ్చి ఏది పడితే అది మాట్లాడటం తప్ప సజ్జలకు, మంత్రులకు ఏం తెలుసు?” అని ఆనంద్ బాబు నిలదీశారు