KTR: కేసీఆర్ సూచన మేరకు పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాం: కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పొన్నాల
- ఇవాళ పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్
- భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్
- బీఆర్ఎస్ లో చేరేందుకు పొన్నాల సానుకూలంగా స్పందించారని వెల్లడి
- రేపు పొన్నాల సీఎం కేసీఆర్ ను కలుస్తారని వివరణ
కాంగ్రెస్ పార్టీలో తన సుదీర్ఘ ప్రస్థానానికి సీనియర్ రాజకీయవేత్త పొన్నాల లక్ష్మయ్య నిన్నటితో ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే, అంతకంటే ఆసక్తికర పరిణామం ఇవాళ జరిగింది.
పొన్నాల నిన్న రాజీనామా చేయగా... బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల ఇంటికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ లోకి వస్తే పొన్నాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ఆయన సీనియారిటీకి గౌరవం ఇస్తామని తెలిపారు.
ఇక, జనగామలో జరిగే బీఆర్ఎస్ సభ ద్వారా పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, అయితే ఆయన సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని, మొత్తానికి పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగానే స్పందించారని కేటీఆర్ వివరించారు. పొన్నాల సీఎం కేసీఆర్ ను ఆదివారం నాడు కలుస్తారని వెల్లడించారు. బలహీన వర్గాల నేతలకు సముచిత గుర్తింపు ఇచ్చిన ఘనత కేసీఆర్ సొంతమని కేటీఆర్ పేర్కొన్నారు.