Air India: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఎయిరిండియా

Air India extends cancellation of flight services between New Delhi and Tel Aviv

  • అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై విరుచుకుపడి నరమేధం సృష్టించిన హమాస్
  • ప్రతీకార దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్
  • 3 లక్షల మంది సైనికులతో భూతల యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధం
  • అక్టోబరు 18 వరకు ఇజ్రాయెల్ కు విమానాలు నడపలేమన్న ఎయిరిండియా

హమాస్ మిలిటెంట్ గ్రూపుపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రస్తుతం ప్రత్రీకారేచ్ఛతో రగిలిపోతోంది. గాజాలో తిష్టవేసిన హమాస్ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు 3 లక్షల మంది సైనికులతో ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి సిద్ధమైంది. అటు, ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదుల రాకెట్ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

గత కొన్నిరోజులుగా దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్ లో పరిస్థితులు కల్లోలభరితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమానాలు నడపరాదని భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇదివరకు ప్రకటించింది. అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లో  మారణహోమం సృష్టించగా, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నామని ఎయిరిండియా ఇటీవలే వెల్లడించింది. 

అయితే, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మళ్లీ రగిలిన చిచ్చు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించకపోవడంతో... విమాన సర్వీసుల రద్దును మరి కొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులను అక్టోబరు 18 వరకు రద్దు చేస్తున్నామని తాజా ప్రకటనలో వెల్లడించింది. 

ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు అవసరమైన మేరకు చార్టర్డ్ విమానాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News