Team India: నువ్వా నేనా అంటూ భారత బౌలర్ల వికెట్ల వేట... 191 పరుగులకు పాక్ కుదేల్
- అహ్మదాబాద్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
- వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికర సమరం
- టాస్ గెలిచి పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించిన టీమిండియా
- 42.5 ఓవర్లలో చాపచుట్టేసిన పాకిస్థాన్
- తలా రెండు వికెట్లు సాధించిన కుల్దీప్, బుమ్రా, సిరాజ్, జడేజా, పాండ్యా
వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సమరంలో టీమిండియా బౌలర్లు పాకిస్థాన్ జట్టును హడలెత్తించారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోగా... మిడిల్ ఓవర్ల వరకు ఓ మోస్తరు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్... అక్కడ్నించి భారత బౌలర్ల వేటకు బలైంది.
టీమిండియా బౌలర్లు నువ్వా నేనా అంటూ పోటీ పడి మరీ పాక్ వికెట్లను పడగొట్టారు. బుమ్రా 2, సిరాజ్ 2, పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లతో పాక్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. శార్దూల్ ఠాకూర్ తప్ప మిగతా బౌలర్లందరూ తలా రెండు వికెట్లతో పాక్ పతనంలో పాలుపంచుకున్నారు.
ఎన్నో ఆశలతో, వరల్డ్ కప్ లో ప్రతిసారీ భారత్ చేతిలో ఓడిపోయే తమ ట్రాక్ రికార్డును సరిదిద్దుకోవాలన్న పట్టుదలతో బరిలో దిగిన పాక్... మైదానంలోకి వచ్చేసరికి చేతులెత్తేసింది. చివరికి 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది.
పాక్ జట్టులో బాబర్ అజామ్ అత్యధికంగా 50 పరుగులు చేయగా, ఫామ్ లో ఉన్న మహ్మద్ రిజ్వాన్ 49, ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ 36, అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు చేశారు. ఈ నలుగురు మినహా మిగతా బ్యాట్స్ మెన్ పేలవంగా ఆడారు. కేవలం 36 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 7 వికెట్లు కోల్పోయిందంటే ఎంత చెత్తగా ఆడారో అర్థమవుతుంది.