Nara Lokesh: ములాఖత్ సమయంలో డీఐజీపై అసహనం వ్యక్తం చేసిన నారా లోకేశ్
- బాబు ఆరోగ్యం గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని మండిపాటు
- వైద్యుల సూచనలను 48 గంటలు గడిచినా అమలు చేయలేదని అసహనం
- మాజీ సీఎం పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ప్రశ్న
తన తండ్రి చంద్రబాబును టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ మధ్యాహ్నం ములాఖత్ ద్వారా కలిశారు. తన తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి అక్కడే ఉన్న డీఐజీని లోకేశ్ నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ... ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కల్పించాల్సిన సౌకర్యాలపై వైద్యులు సూచనలు చేసి 48 గంటలు గడిచినా వాటిని అమలు చేయలేదని దుయ్యబట్టారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లటి వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు లోకేశ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని డీఐజీ రవికిరణ్... ములాఖత్ సమయం అయిపోయిందని, వెంటనే వెళ్లిపోవాలని లోకేశ్ కు చెప్పారు.