BRS: మళ్లీ విజయం మనదే.. బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్
- అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో సమావేశం
- ఎవరూ తొందరపడవద్దని సూచన
- అన్నీ తెలుసని అనుకోవద్దంటూ హితవు
- బీఫామ్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న కేసీఆర్
తెలంగాణలో మళ్లీ మనదే విజయమంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోమారు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఐదారుగురు తప్ప సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇచ్చామని, రెండు రోజుల్లో అభ్యర్థులు అందరికీ బీఫామ్ లు అందజేస్తామన్నారు. సామరస్యపూర్వకంగా సీట్లను సర్దుబాటు చేశామని, వేములవాడలో న్యాయపరమైన చిక్కుల కారణంగా అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని వివరించారు. విధిలేని పరిస్థితిలోనే అభ్యర్థులను మార్చామని చెప్పారు.
టికెట్ దక్కని నేతలు తొందరపడవద్దని ఇప్పటికే చెప్పామని, మరోమారు కూడా చెబుతున్నామని అన్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులదేనని కేసీఆర్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించలేక రాజకీయ ప్రత్యర్థులు కుయుక్తులు పన్నుతున్నారని, సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అభ్యర్థులను అలర్ట్ చేశారు. ప్రస్తుతం 51 బీఫామ్ లు రెడీ అయ్యాయని, మిగతావి రేపటిలోగా రెడీ అవుతాయని చెప్పారు. బీఫామ్ లు నింపేటపుడు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించారు. అన్నీ మాకే తెలుసని అనుకోవద్దని, ప్రతీది తెలుసుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. కోపతాపాలను పక్కన పెట్టి చిన్న కార్యకర్తను కూడా కలుసుకోవాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.