Ambati Rambabu: ఏ రాష్ట్రంలో ఏ ఖైదీకి ఏసీ ఇవ్వలేదు... చంద్రబాబుకు ఇచ్చారు: అంబటి రాంబాబు

Ambati Rambabu talks about Chandrababu health issue

  • చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో టవర్ ఏసీ సౌకర్యం
  • నిన్న ఏసీబీ కోర్టు అత్యవసర ఆదేశాలు
  • కోర్టు ఏం చెబితే  తమ ప్రభుత్వం అది పాటిస్తుందన్న అంబటి
  • చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ ముసురుకున్న వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ఖైదీకి ఏసీ ఇచ్చిన దాఖలాలు లేవని, కానీ చంద్రబాబుకు ఇచ్చారని వెల్లడించారు. కోర్టు ఏం చెబితే తమ ప్రభుత్వం అది పాటిస్తుందని, ఖైదీలకు ఏం ఇవ్వాలో, ఏం ఇవ్వకూడదో నిర్ణయించాల్సింది కోర్టు అయినప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. 

చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ముందు తెలియదా? చంద్రబాబు తరఫున 35 రోజులుగా కోర్టులో వాదిస్తున్న న్యాయవాదులు ఏసీ ఇవ్వాలని ఒక్కరోజైనా అడిగారా? అని అంబటి ప్రశ్నించారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, 5 కిలోల బరువు తగ్గిపోయారు, ప్రాణాపాయం ఉంది, స్టెరాయిడ్లు ఇస్తున్నారు అంటూ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డే దీనికి బాధ్యత వహించాలి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబుకు ఎప్పటి నుంచో చర్మ సమస్యలు ఉన్న విషయం తెలిసిందేనని అన్నారు. జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా బురద చల్లే కార్యక్రమం గత మూడ్రోజులుగా జరుగుతుండడం బాధాకరమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 

చంద్రబాబు జైల్లో ప్రవేశించినప్పుడు 66 కిలోలు ఉన్నారని, ఆయన ఇప్పుడు 67 కిలోల బరువున్నాడని అధికారికంగా ప్రకటించారని వెల్లడించారు. కానీ, టీడీపీలో సీనియర్ నేత అయిన యనమల, చంద్రబాబు బరువుపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గిపోయాడని యనమల చెప్పాడని, ఇప్పుడు చంద్రబాబు అధికారికంగా ఒక కిలో బరువు పెరిగిన విషయం వెల్లడైందని, దీనికి యనమల ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలను టీడీపీ ఇకనైనా కట్టిపెట్టాలని, చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటోందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నేరం చేశారనడానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టే సీనియర్ న్యాయవాదులు వాదించినా ఆయనకు బెయిల్ దొరకడంలేదని అన్నారు.

  • Loading...

More Telugu News