MLC Ashok Babu: చంద్రబాబు బ్యారక్ లో ఏసీ పెడితే చాలదు... ఆయన బాడీ చెకప్ చేయాలి: అశోక్ బాబు

Ashok Babu demands full body check up for Chandrababu

  • రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏసీ సదుపాయం
  • ఏసీబీ కోర్టు ఆదేశాలు
  • జైలు అధికారి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు
  • టీడీపీ గెలిస్తే వైసీపీ నేతలు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్ లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేశారని, కానీ చంద్రబాబుకు బాడీ చెకప్ చేయించాలని డిమాండ్ చేశారు. 

ఇవాళ మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో అశోక్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పై ధ్వజమెత్తారు. 

"జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఒక డాక్టర్ లా వ్యవహరించారు. పాత మెడికల్ హిస్టరీ తెలుసుకోకుండా మాట్లాడారు. 2,039 మంది ఖైదీల్లో చంద్రబాబు నాయుడు ఒక్కరినే  ప్రత్యేకంగా చూడలేమంటూ జైలు అధికారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. 140 కోట్ల మంది భారతీయుల్లో జగన్ ఒక్కడే. అలాంటి వ్యక్తికి హెలికాప్టర్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, సెక్యూరిటీ ఇవన్నీ ఎందుకు? ఆయన సీఎం అనే కదా! అలాగే చంద్రబాబు కూడా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి... కాబట్టి ప్రత్యేకంగా చూడాలి. జగన్ చంచల్ గూడ జైల్లో ఎంజాయ్ చేసినట్లు చంద్రబాబు ఎంజాయ్ చేయటంలేదు. 

చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు... అలాంటి వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? జైలును అత్తగారి ఇల్లులా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. చంచల్ గూడ జైలును వైసీపీ కార్యాలయంగా మార్చి, అక్కడే పార్టీలో చేరికలు, పార్టీ సమావేశాలు నిర్వహించారు. షటిల్ ఆడుతూ చంచల్ గూడ జైలులో జగన్ కాలక్షేపం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయినా, ప్రజలు మరచిపోలేదు.

74 సంవత్సరాల చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం డెర్మటాలజీ చెకప్ చేయిస్తే చాలదు, బాడీ చెకప్ చేయాలి. జైళ్ల అధికారులు డాక్టర్లు చెప్పింది యథాతథంగా చెప్పటంలేదు, వివరాలు దాస్తున్నారు. హెల్త్ బులిటెన్ విడుదల చేయటంలేదు. చంద్రబాబు బరువు నెల క్రితం ఎంత ఉంది, ఇప్పుడెంత ఉంది అనేది డాక్టర్లు చెప్పాలి. 

జైల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటిని సప్లై చేయడం వల్లే చంద్రబాబుకు అలర్జీ వచ్చింది. జైల్లో ఉన్న డాక్టర్లు జీజీహెచ్ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో డాక్టర్ల రిపోర్టుని యథావిధిగా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. లేదా అదే రిపోర్టును జతచేస్తూ మీరు బులిటెన్ విడుదల చేయాలి. 

 సజ్జల ఒకలాగా, జైళ్ల డీఐజీ ఒకలాగా, మంత్రులు ఒకలాగా మాట్లాడడం సబబుకాదు. డీ హైడ్రేషన్ తో చంద్రబాబు గారు అస్వస్థతకు గురికావడంతో కోట్లాదిమంది తెలుగు ప్రజలు తల్లడిల్లుతుంటే వైసీపీ నాయకులకు నవ్వులాటగా ఉంది. అధికారంలో ఉన్నాము కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. 

అన్ని సమయాలు ఇలాగే ఉండవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు. వైసీపీ వారు అన్నం తినే పరిస్థితులు కూడా ఉండవు. వైసీపీ నాయకులు బతికున్నంత కాలం చిప్ప కూడు తినాల్సిందే. వైసీపీ నాయకులు చేసిన  అరాచకాలు అంతా ఇంతా కాదు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో అవసరమైతే ఆయన వ్యక్తిగత వైద్యుల్ని అనుమతించాలి. చంద్రబాబుకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే" అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News