Argentina: పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డు... టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన అర్జెంటీనా అమ్మాయిలు
- టీ20 మ్యాచ్ లో 427 పరుగులు చేసిన అర్జెంటీనా మహిళల జట్టు
- పురుషుల, మహిళల టీ20 క్రికెట్లో ఇదే హయ్యస్ట్ స్కోరు
- అర్జెంటీనా ఊచకోతకు బలైన చిలీ
- సెంచరీలతో విధ్వంసం సృష్టించిన ఇద్దరమ్మాయిలు
అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించింది. పురుషులకు కూడా సాధ్యం కాని రీతిలో, ఏకంగా 427 పరుగులు బాదేసింది. తద్వారా, టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అర్జెంటీనా అమ్మాయిలు లూసియా టేలర్, ఆల్బర్టినా గలాన్ పరుగుల వర్షం కురిపించారు. లూసియా టేలర్ 84 బంతుల్లో 169 పరుగులు చేయగా, గలాన్ 84 బంతుల్లో 145 (నాటౌట్) పరుగులు సాధించింది. టేలర్ 27 ఫోర్లు, గలాన్ 23 ఫోర్లు కొట్టారు. వీరిద్దరూ ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే ఇంత విధ్వంసం సృష్టించడం విశేషం.
లూసియా టేలర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇప్పటివరకు 29 పరుగులే... అయితే, ఏమంత అనుభవంలేని చిలీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ టేలర్ మూడంకెల స్కోరు నమోదు చేసింది.
ఈ మ్యాచ్ తో అనేక వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. గతేడాది సౌదీ అరేబియాపై బహ్రెయిన్ చేసిన 318 పరుగుల రికార్డును అర్జెంటీనా తుడిచిపెట్టింది. పురుషుల టీ20 క్రికెట్లో కూడా ఇంత స్కోరు ఏ జట్టు సాధించలేకపోయింది. పురుషుల టీ20 క్రికెట్లో హయ్యస్ట్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. గత నెలలోనే నేపాల్ జట్టు మంగోలియాపై 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది.
ఇప్పుడు అర్జెంటీనా మహిళల జట్టు వీరబాదుడుతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అర్జెంటీనా ఓపెనర్లు లూసియా టేలర్, ఆల్బర్టినా గలాన్ తొలి వికెట్ కు 350 పరుగులు జోడించగా... ఇది కూడా ఓ రికార్డే. పురుషుల క్రికెట్లోనూ, మహిళల క్రికెట్లోనూ ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతేకాదు, ఓ టీ20 మ్యాచ్ ల్లో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయడం కూడా ఇదే ప్రథమం.
ఈ మ్యాచ్ లో చిలీ జట్టులో ఏడు కొత్త ముఖాలకు చోటిచ్చారు. చిలీ బౌలర్ ఫ్లోరెన్సియా మార్టినెజ్ పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ విసిరిన మార్టినెజ్ ఆ ఓవర్లో రికార్డు స్థాయిలో 52 పరుగులు సమర్పించుకుంది.
బ్యూనోస్ ఎయిర్స్ నగరంలోని మారిస్ రన్నాకిల్స్ ఓవల్ మైదానంలో జరిగిన పోరులో అర్జెంటీనా 20 ఓవర్లలో 1 వికెట్ కు 427 పరుగులు చేయగా... అత్యంత భారీ లక్ష్యంతో బరిలో దిగిన చిలీ జట్టు కేవలం 63 పరుగులకే కుప్పకూలింది. జెసికా మిరాండా 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో చిలీ 64 నోబాల్స్ విసరగా, అది కూడా ఒక రికార్డుగా మారింది.
అర్జెంటీనా జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో 66వ స్థానంలో ఉండగా, తగినన్ని మ్యాచ్ లు ఆడని కారణంగా చిలీకి ఇంకా ర్యాంకింగ్ ఇవ్వలేదు.